సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది : అల్లు అరవింద్

ఎప్పుడూ ఫుల్ జోష్‌లో కనిపించే హీరో విజయ్ దేవరకొండ పైరసీ వ్యవహారంతో బాగా డీలా పడిపోయాడు. ‘గీత గోవిందం’ ప్రిరిలీజ్ ఈవెంట్లో చాలా ఉద్వేగంతో మాట్లాడాడు. నిర్మాత అల్లు అరవింద్ సైతం ఆ ఈవెంట్లో చాలా ఆవేశంగా, ఆగ్రహంగా మాట్లాడాడు. ఈ ఉదంతం నేపథ్యంలో అరవింద్ ఇక సినిమాలే మానేద్దామన్న నిర్ణయానికి కూడా వచ్చాడట. ఈ విషయాన్ని దిల్ రాజు వెల్లడించాడు.తెలుగు సినీ పరిశ్రమలో ‘గీత గోవిందం’ పైరసీ గురించే చర్చంతా. మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఉత్సాహంగా విడుదలకు సిద్ధం చేస్తుండగా పైరసీ రూపంలో పిడుగు లాంటి వార్త చిత్ర బృందాన్ని కుదిపేసింది. నిర్మాత బన్నీ వాసు నేతృత్వంలో ఒక టీం ఏర్పాటు చేసి అదే పనిగా ఇంటర్నెట్లో పైరసీ లింకులు తీయించాల్సిన పరిస్థితి వచ్చింది.

‘గీత గోవిందం’ పైరసీకి సంబంధించి అరవింద్‌, బన్నీ వాసు, విజయ్ దేవరకొండలతో కలిసి రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రోజు ముందు తనకు అరవింద్ ఫోన్ చేసి చాలా ఆవేదనతో మాట్లాడాడని, సినిమాలు మానేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోందని అన్నాడని వెల్లడించాడు. 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాత ఇలా అనడం తనకు చాలా బాధ కలిగించిందని రాజు చెప్పాడు. మేమందరం మీ వెంట ఉన్నాం అని ఆయనకు ధైర్యం చెప్పి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు రాజు తెలిపాడు.

ఒక సినిమా కోసం తామంతా ప్రాణం పెట్టి పని చేస్తామని అదే తమ జీవితమని అలాంటపుడు సినిమాను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తే దాన్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటని రాజు ప్రశ్నించాడు. తెలిసో తెలియకో తప్పు చేస్తున్నారని కానీ ఆ తప్పు చేసిన వాళ్లు బుద్ధి తెచ్చుకుని ఇలాంటి వాటిని నివారించాలని రాజు సూచించాడు.

No comments