కాళేశ్వరం అద్భుతం


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను ఆహ్వానించారు. ఆధునిక యుగంలో గొప్ప ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న దీనిని నిర్మాణ దశలోనే చూడాలని కోరారు. హైదరాబాద్‌ వచ్చిన దేవెగౌడ ఆదివారం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఇక్కడ ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరైన అనంతరం ఆయన సీఎం ఇంటికి వచ్చారు. కేసీఆర్‌ ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మంత్రి కేటీఆర్‌, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మేయరు రామ్మోహన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దేవెగౌడలు ఏకాంతంగా సమావేశమయ్యారు. కర్ణాటక, తెలంగాణ మధ్య సత్సంబంధాలు, ముందస్తు ఎన్నికలు తదితర అంశాల గురించి చర్చించారు. కర్ణాటకలో ప్రభుత్వ నిర్వహణకు కాంగ్రెస్‌ పార్టీ సహకారంపైనా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి చెప్పారు. చరిత్రలో అతి గొప్ప ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం చేరుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమాన్ని ఆయనకు వివరించారు. దీంతో త్వరలోనే కాళేశ్వరానికి వస్తానని దేవెగౌడ హామీ ఇచ్చారు.

No comments