ఆగస్టు 15న మూడు వరాలు…!

తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను బుధవారం నుంచి సర్కారు చేపడుతున్నది. ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను బల్క్‌గా గ్రామాలకు అందించనున్నారు. పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా పంద్రాగస్టు నాడు అన్ని గ్రామాలలో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడకూడదని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ప్రజలకు కండ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజలందరికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

గ్రామసీమలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయరంగం పురోభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. స్వయానా రైతు అయిన ముఖ్యమంత్రికి రైతుల బాధలేమిటో బాగా తెలుసు. రైతుకు సర్కారు దన్నుగా నిలిస్తే ఎంత కష్టమైనా చేసి ఉత్పత్తిని పెంచుతారని, అభివృద్ధిలో భాగస్వాములవుతారని గుర్తెరిగారు. అందుకే ముందుగా భూమి సమస్యలను పరిష్కరించడానికి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ వెంటనే రైతు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఇచ్చారు. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలుచేయనున్నారు. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీతో బడుగువర్గాలకు ఆర్థికసహాయం అందించే పథకాన్ని ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా ఆరోజు జిల్లాకు వందమంది లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్ గా మంచినీటి సరఫరాను పంద్రాగస్టునాడే అందించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు పూర్తిచేశారు. మరోవైపు రాష్ట్రంలోని 12751 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నెలపాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. స్థూలంగా ఎన్నికలు ఎదుర్కుంటే… ఎలాంటి పథకాలు – ప్రకటనలు చేస్తారో అదే తరహాలో సీఎం కేసీఆర్ పంద్రాగస్టు వరాలు ఉంటాయని చర్చ జరుగుతుంది.


No comments